డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు
గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం
ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి సీతక్క
నూతన వస్త్రాలు బహుకరించిన సీతక్క
డిశ్చార్జ్ సందర్భంగా భావోద్వేగ సన్నివేశం
కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
హైదరాబాద్,అక్టోబర్06 వై 7 న్యూస్;
ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స అందుకున్న ఆదివాసీ మహిళ ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. బాధిత మహిళ కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బాధిత మహిళ గాంధీ ఆసుపత్రి లో చేరినప్పటి నుంచి డిస్చార్జ్ అయ్యేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ, అదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడటంతో పాటు, బాధితురాలికి, బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని కలుస్తూ, పరామర్శిస్తూ ధైర్యం సడలకుండా భరోసా కల్పించారు మంత్రి సీతక్క. నెల రోజుల నుంచి గాంధీ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది, బాధితురాలిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ లతోపాటు పలు సర్జరీలు చేసి బాధితురాలని కాపాడారు. నెల రోజులపాటు మెరుగైన వైద్యం అందించడంతో బాధిత మహిళ కోలుకున్నారు. ఈ నేపద్యంలో బాధితురాలికి కావాల్సిన అన్ని మందులు ఇచ్చి ఆదివారం నాడు డిస్చార్జ్ చేశారు.
డిశ్చార్జ్ సందర్భంగా మంత్రి సీతక్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ లు భాదితురాలి వెంట ఉన్నారు. బాధితురాలికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహుకరించారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. బాధితురాలిని అప్యాయంగా వార్డు నుంచి తోడ్కొని వచ్చి కారులో కూర్చోబెట్టి జైనూర్ కి పంపించారు.
ఈ సందర్భంగా బాధితురాలు చాలా ఎమోషనల్ అయ్యారు. మంత్రి సీతక్కకు వీడ్కోలు పలుకుతూ కంటతడి పెట్టారు. బాధితురాలికి ధైర్యం చెప్పి.. ఏలాంటి ఇబ్బందులు వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు మంత్రి సీతక్క.