రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పూర్వం నుంచి పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా దీని ప్రాధాన్యత పెరుగుతోందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. మొలకలు, ఇతర పోషకాహార పదార్థాలు తినడం ఇష్టం లేనివారు రాగి జావను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. దీన్ని తక్కువ సమయంలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.
100 గ్రాముల రాగుల్లో సుమారు 344 మిల్లీగ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీల శక్తి, 3.6 గ్రాముల పీచుపదార్థం, 7.3 గ్రాముల ప్రొటీన్, 1.3 గ్రాముల కొవ్వు ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం అధికంగా ఉండటం రాగుల ప్రత్యేకత. అందుకే ఎముకల బలానికి, శరీరానికి పోషకాలు అందించేందుకు పూర్వం వృద్ధులు, బలహీనంగా ఉన్నవారికి రాగి జావ ఇచ్చేవారని చెబుతారు.
అయితే రాగి జావ ఒక్కటే సంపూర్ణ పోషకాహారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువగా ఉండే ఉద్యోగులు, వ్యాపారులు, పిల్లలు తమ ఆహారంలో పిండి పదార్థాల పరిమాణంపై శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. మూడు పూటలా ధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని, అందువల్ల రాగి జావతో పాటు ప్రొటీన్లు, కూరగాయలు, ఇతర పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.
Post Views: 3








