తహశీల్దార్‌కు ఏపీడబ్ల్యూజేఎఫ్ కోడుమూరు తాలూకా కమిటీ వినతి
కోడుమూరు, కర్నూలు జిల్లా: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కోడుమూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు.
గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు, ఇళ్ల నిర్మాణానికి కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంటూ, దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసుల నమోదు, వేధింపులను అరికట్టి, విధి నిర్వహణలో తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని, కరోనా సమయంలో రద్దు చేసిన రైల్వే పాసులను తిరిగి పునరుద్ధరించి ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా అధ్యక్షుడు, ఎన్‌టీవీ రఘు, కార్యదర్శి, సాక్షి హంపి రెడ్డి, యుగంధర్, సుమన్ టీవీ వీరన్న, 99 టీవీ రిపోర్టర్ శివ, ఐ న్యూస్ రిపోర్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు.









