బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ
కరకగూడెం, అక్టోబర్ 12 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామానికి చెందిన యువకుడు భాదావత్ రవిచంద్ర మృతి ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకుడి మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు లోతుగా పరిశీలించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.
విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సాక్ష్యాధారాల ఆధారంగా నిజాలను వెలికితీయాలని, బాధ్యులుగా నిర్ధారణ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలుకుబడి ఉన్నవారైనా, సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.
కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు పోస్టుమార్టం నివేదిక సహా అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని, బాధిత కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించి, కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సంబంధిత అధికారులను కోరారు.
రవిచంద్ర మృతి ఘటనను సాధారణ విషయంగా తీసుకోరాదని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తుడుందెబ్బ అండగా నిలుస్తుందని వెంకటనారాయణ తెలిపారు. ఆదివాసీల ప్రాణాలకు, హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
— దిలీప్ కుమార్, Y7 న్యూస్ తెలుగు ప్రతినిధి, కరకగూడెం మండలం









