E-PAPER

మోదీ హ్యాండ్‌షేక్‌తో ట్రంప్‌ ఇబ్బంది..! జాన్‌ బోల్టన్‌ ఆసక్తికర వాఖ్యలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హ్యాండ్‌షేక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటివారితో కరచాలనం చేస్తూనే తనవైపు బలంగా లాగడం ఆయన శైలిగా మారింది. ప్రపంచ నేతలతో ట్రంప్‌ కరచాలనం చేసిన సందర్భాలు గతంలో చాలాసార్లు చర్చకు వచ్చాయి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేసినప్పుడు మాత్రం ట్రంప్‌ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వెల్లడించారు.

ఆర్‌టీ ఇంటర్నేషనల్‌ కార్యక్రమం ‘న్యూ ఆర్డర్‌ విత్‌ అఫ్షిన్‌ రత్తాన్సీ’లో పాల్గొన్న బోల్టన్‌ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ‘ఎక్స్‌’లోనూ పంచుకున్నారు. ‘‘ఒకసారి ట్రంప్‌తో ప్రధాని మోదీ చాలా బలంగా కరచాలనం చేశారు. ట్రంప్‌ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. మోదీ ఎంత బలవంతుడో ఈ సంఘటన గుర్తు చేస్తుంది’’ అని బోల్టన్‌ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ హ్యాండ్‌షేక్‌ శైలి అమెరికా మీడియాలో గతంలోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది. ఎదుటివారి చేతిని పట్టుకుని తనవైపు లాగడం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2017లో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం కూడా ట్రంప్‌ కరచాలనం చేసే తీరును ప్రస్తావించింది. అప్పటి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి నామినేట్‌ అయిన నీల్‌ గోర్సచ్‌, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబేతో ఆయన కరచాలనం చేసిన సందర్భాలను ఉదాహరణలుగా పేర్కొంది.

అదే ఏడాది సీఎన్‌ఎన్‌ కూడా ట్రంప్‌ హ్యాండ్‌షేక్‌పై విశ్లేషణ ప్రసారం చేసింది. ఆయన ఎదుటివారిని ఒక్క క్షణం పాటు తమ బ్యాలెన్స్‌ కోల్పోయేలా లాగుతారని బాడీ లాంగ్వేజ్‌ నిపుణుడు క్రిస్‌ ఉల్రిచ్‌ వ్యాఖ్యానించారు. సీబీఎస్‌ న్యూస్‌తో మాట్లాడిన మరో నిపుణుడు డాన్‌ ఖౌరీ ఈ విధానాన్ని ఆధిపత్యాన్ని చాటే చర్యగా అభివర్ణించారు.

ట్రంప్‌ ‘షేక్‌ హ్యాండ్‌’లను ది వాషింగ్టన్‌ పోస్ట్‌ ‘ట్రంప్‌షేక్స్‌’గా పేర్కొనగా, టైమ్‌ పత్రిక వాటిని ఆధిపత్యం కోసం జరిగే పోరాటంగా అభివర్ణించింది. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌లతో ట్రంప్‌ కరచాలనం చేసిన సందర్భాలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు బోల్టన్‌ చెప్పిన మోదీతో కరచాలనం ఉదంతం ఈ చర్చకు మరో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!