E-PAPER

నిరసన స్థలంగా జంతర్ మంతర్ తొలగింపు..!

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం ఏకపక్షమని, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిరసన స్థలాన్ని నిర్ణయిస్తారని, ప్రభుత్వం కాదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం నిరసన స్థలాన్ని మార్చగలదేమో కానీ, ప్రజల ఆగ్రహాన్ని తగ్గించలేదని స్పష్టం చేశారు.

సోమవారం ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ, “ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాం. అందుకే ప్రతిపక్షాలన్నీ కలిసి బారాఖంబా రోడ్డుకు వెళ్తున్నాం. సాధారణంగా బోట్ క్లబ్‌లో నిరసనలు జరుగుతాయి. మీరు నిరసన వేదికలను మార్చవచ్చు, కానీ ప్రజల కోపాన్ని తగ్గించలేరు” అని అన్నారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా స్పందిస్తూ, “దీన్ని ఎలా రద్దు చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఎక్కడ నిరసన చేయాలో ఎవరు నిర్ణయిస్తారు? అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పడానికి భారతదేశంలోని ప్రతి అంగుళం స్వేచ్ఛాయుతమైనదే. ఈ స్వేచ్ఛను మాకు రాజ్యాంగం ఇచ్చింది” అని పేర్కొన్నారు.

మరికొందరు కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. “ప్రభుత్వం ఈ దేశ పౌరులుగా మమ్మల్ని గుర్తించడం లేదు కాబట్టి, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల్లో ఎక్కడైనా నిరసన స్థలం చూపిస్తే అక్కడికి వెళ్లి నిరసన తెలుపుతాం” అని సందీప్ దీక్షిత్ అన్నారు. హరియాణా ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ.. ప్రభుత్వం భయపడిందని, ప్రజల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. “ఢిల్లీ వారి తండ్రి ఆస్తి అన్నట్లుగా.. ఇక ఢిల్లీకి రావద్దని కూడా చెబుతారు” అని ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ విమర్శించగా, “ఇకపై హిమాలయాల శిఖరాలపై నిరసన చేస్తాం” అని మరో ఎంపీ ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యానించారు.

హోం మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్‌ను నిరసనల కోసం నిర్దేశించిన స్థలం జాబితా నుంచి డీ-నోటిఫై చేసినట్లు ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిరసనల కోసం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం, బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్ అనే మూడు కొత్త ప్రదేశాలను కేటాయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ ఘర్షణకు దారితీసింది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!