E-PAPER

చీఫ్‌ జస్టిస్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ పోస్టు..! విమర్శలతో డిలీట్‌..!

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ కేరళ విభాగం చేసిన పోస్టు రాజకీయ దుమారం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని గంటలకే ఆ పోస్టును తొలగించింది. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, అది తన పరిధిలోకి రాదని సీజేఐ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ ఈ విధంగా స్పందించింది.

సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో కాంగ్రెస్‌ కేరళ విభాగం స్పందిస్తూ.. “జస్టిస్‌ సూర్యకాంత్‌ గారూ.. శాంతిభద్రతలు మీ పరిధిలో లేకపోతే వెంటనే రాజీనామా చేయండి. ఆ బాధ్యతలు నిర్వహించగల వ్యక్తిని మేం వెతుక్కుంటాం” అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేరళ విభాగం తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.

ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావిస్తూ.. అప్పట్లో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చిన రోజులు ముగిశాయని బీజేపీ పేర్కొంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని నూతన భారతదేశంలో అలాంటి ప్రయత్నాలు సాగవంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఇరు పార్టీల మధ్య ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది.

సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) 33వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నిరసనలు, వాటిపై ఆంక్షల గురించి ప్రశ్నించగా, “ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం. ఇది నా పరిధిలోకి రాదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్‌ విమర్శలకు కారణమయ్యాయి.

మరోవైపు, ఓటర్ల జాబితా వివాదంపై ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు సమావేశం కోరిన అంశంపైనా సీజేఐ స్పందించారు. సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయన్నారు. పౌరులు లేదా ప్రజాప్రతినిధులు పిటిషన్‌ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు.

ప్రతిపక్షాల అభ్యర్థన తనకు అందిందని, అయితే వారు లేవనెత్తిన అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా సమావేశం కావడం సముచితం కాదని లేఖ ద్వారా వివరించినట్లు చెప్పారు. సమావేశానికి బదులుగా న్యాయపరమైన మార్గాన్ని అనుసరించి పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించారు. ఇదే తరహా అంశాలపై అక్టోబర్‌ 13న విచారణ జరగాల్సి ఉందని కూడా పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!