
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానం
భద్రాచలం: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ 1991–94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తీర్మానించారు. ఈ కార్యక్రమాల ద్వారా తాము చదువుకున్న విద్యాసంస్థల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఆదివారం భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ 1991–94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా జరిగింది. ఈ సమావేశానికి పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులంతా తమవంతు కృషి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను అధికారికంగా నిర్వహించి, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. త్వరలోనే కళాశాల పూర్వ విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి, కళాశాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై చర్చించేందుకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.
తాము విద్యనభ్యసించిన కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెరిక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఖమ్మం బ్యూరో ఇన్‌చార్జి నలజాల వెంకటరావు, కుంచాల రమేష్, రామ్‌లాల్, ఎం. పద్మ తదితరులు పాల్గొన్నారు.









