E-PAPER

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమంపై సింగరేణి అవగాహన కార్యక్రమం

కార్మిక చట్టాలు, CMPF/EPF, ESI, హాజరు, వేతన చెల్లింపులపై కాంట్రాక్టర్లకు మార్గనిర్దేశం

మణుగూరు, అక్టోబర్ 08 (Y7 News Telugu): సింగరేణి మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, చట్టబద్ధమైన బాధ్యతలు, వివిధ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, భద్రత, వారికి అందాల్సిన చట్టబద్ధమైన ప్రయోజనాల అమలులో కాంట్రాక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్మికులకు సంబంధించిన అన్ని రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తూ, సంస్థ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్) సలగల రమేష్ కాంట్రాక్టర్లకు CMPF/EPF, ESI, S-Intraweb/sCEMS హాజరు నమోదు, వేతనాల చెల్లింపులు, కార్మిక సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. మణుగూరు ఏరియాలో ప్రస్తుతం 198 మంది కాంట్రాక్టర్ల పరిధిలో 2,890 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నట్లు వివరించారు.
CMPF/EPF కవరేజ్‌కు సంబంధించిన తాజా మార్గదర్శకాలను వివరించిన ఆయన, EPF కింద ఇప్పటికే సభ్యత్వం ఉన్న కార్మికులు అదే కొనసాగించవచ్చని, ఇతరులకు CMPF కవరేజ్ కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఉద్యోగి, యజమాని వాటాలకు సంబంధించిన విధానాన్ని కూడా వివరించారు.
అదేవిధంగా S-Intraweb/sCEMSలో కార్మికుల వివరాలు, రోజువారీ హాజరు నమోదు తప్పనిసరిగా చేయాలని సూచించారు. హాజరు నమోదు లేకుండా విధుల్లోకి అనుమతించడం లేదా హాజరు వివరాలు, బిల్లుల్లో వ్యత్యాసాలు ఉండటం వల్ల తలెత్తే సమస్యలను వివరించారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో S-Intraweb హాజరు వివరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాలు చెల్లించడం, పే స్లిప్‌లు అందించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే ESI పథకం కింద కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందే వైద్య, అనారోగ్య, వైకల్య, ప్రసూతి తదితర ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ బ్యాంకుల్లో జీతాల ఖాతాల ద్వారా కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాద బీమా వంటి అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఫైనాన్స్, సేఫ్టీ, ఐటీ, పర్సనల్ విభాగాల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!