పలాస, అక్టోబర్ 8 (Y7 News Telugu):
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని దేవునల్లాడ గ్రామంలో “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” (PMMSY) పథకం కింద నిర్మించిన నూతన చేపల వేలం హాలు మరియు అనుబంధ భవనాన్ని గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
తీర ప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా సుమారు రూ.13 లక్షల వ్యయంతో ఈ చేపల వేలం హాలును నిర్మించారు. మత్స్యకారులు సముద్రంలో వేటాడి తీసుకొచ్చే చేపలకు సరైన ధర లభించేలా, పరిశుభ్రమైన వాతావరణంలో వేలం నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, చేపల విక్రయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం కోసం ఇటువంటి సదుపాయాలు కీలకమని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Y7 NEWS – ప్రజల గొంతుక









