E-PAPER

సర్కారు బడుల్లో బోధన.. సొంత పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో ఎందుకు?

బోధనపై నమ్మకలేమా? సామాజిక హోదా వ్యామోహమా?

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సర్కారు బడులు తప్పనిసరి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్

ఖమ్మం, సెప్టెంబర్ 14 (వై7 న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తమ సొంత పిల్లలను మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించడం సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తోందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసు అఖిల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని చెబుతున్న వారే తమ పిల్లలను అక్కడ చదివించకపోవడం వారి బోధనా సామర్థ్యంపై నమ్మకలేమికి సంకేతమా? లేక సమాజంలో పెరుగుతున్న సామాజిక హోదా వ్యామోహమా? అని ఆయన ప్రశ్నించారు.

సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. ఒకప్పుడు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్కారు బడులు నేడు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే విధంగా చట్టం తీసుకురావాలని మాదాసు అఖిల్ డిమాండ్ చేశారు. అలాంటి నిబంధన అమల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నిధుల కేటాయింపు, పర్యవేక్షణ వ్యవస్థలు మరింత మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిభావంతులేనని, అయితే ప్రజల్లో ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెరగాలంటే ముందుగా ఉపాధ్యాయులే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా సమాజానికి స్పష్టమైన సందేశం ఇవ్వగలరని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కేవలం పేదల విద్యా కేంద్రాలుగా కాకుండా నాణ్యమైన విద్యకు నిలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసు అఖిల్ కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!