E-PAPER

భద్రాచలం బ్రిడ్జి రోడ్డులో మరో ప్రాణం బలి ట్రాఫిక్ వ్యవస్థ వైఫల్యమా..? అధికారుల నిర్లక్ష్యమా..?

భద్రాచలం, సెప్టెంబర్ 13 (వై7 న్యూస్ తెలుగు):
భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా హాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు మృతదేహం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ఘటనతో భద్రాచలం ప్రజల్లో మరోసారి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన భద్రాచలంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, నియంత్రణ లేకుండా తిరుగుతున్న భారీ వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్ల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రత్యేకంగా బ్రిడ్జి రోడ్డుపై పరిమితికి మించి వేగంతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు, భారీ వాహనాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండి, 20 మందికి పైగా సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజల భద్రత కంటే చలానాల వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

“ప్రమాదాలు జరుగుతాయని ఎన్నోసార్లు హెచ్చరించాం. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో లైటింగ్ మెరుగుపరచాలని, భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలని కోరాం. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మరో ప్రాణం పోయింది” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత అయినా ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత శాఖలు మేల్కొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటారా? లేక ఇలాంటి ఘటనలు మరిన్ని జరగాల్సి వస్తుందా? అనే చర్చ పట్టణంలో సాగుతోంది.

“వ్యవస్థ తప్పిదమా..? అధికారుల నిర్లక్ష్యమా..? లేక ప్రజల ప్రాణాలకు విలువ లేదా..?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు సంబంధిత అధికారులపైనే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!