మణుగూరు, సెప్టెంబర్ 9: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం, ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్ మాట్లాడుతూ, నిరసన తెలిపిన దళిత నాయకులను అవమానించేలా జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి చర్యలు సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అలాగే, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ విషయంపై స్పందించి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బర్ల శ్వేతన్, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు పొడుతూరి రవి, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, మండల నాయకులు నర్సింహారావు, సురేందర్ రెడ్డి, ఉప్పయ్య, జైపాల్ రెడ్డి, నానాజీ తదితరులు పాల్గొన్నారు.









