అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-95పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పార్ట్‌టైమ్ పని కోసం వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లి చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఎన్. రాహుల్ ఉన్నట్లు గుర్తించారు. సుమారు మూడు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన రాహుల్.. ఎంఎస్ పూర్తి చేసి సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదానికి కొద్దిసేపటి ముందు రాహుల్ తన తల్లితో ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం అతని స్నేహితులు పార్ట్‌టైమ్ పని కోసం తీసుకెళ్లేందుకు వచ్చారని, ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ విషాద వార్త తెలియడంతో రాహుల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాహుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు మిగతా ఇద్దరు విద్యార్థుల గుర్తింపు వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
రాహుల్ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ప్రక్రియలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సహాయం అందిస్తున్నట్లు సమాచారం. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన పత్రాలు, లాంఛనాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం కారు రహదారి నుంచి పక్కకు వెళ్లి చెట్టును ఢీకొట్టిన అనంతరం మంటలు చెలరేగాయి. ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలోని తెలంగాణ సమాజంలోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.









