E-PAPER

డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్


మంచిర్యాల: ప్రజలకు ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా ఆపరేషన్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

పాఠశాలలు, కళాశాలలు, బాలికల వసతి గృహాలు, గోదావరి నది తీర ప్రాంతాలు, మైదానాలు తదితర సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాజీవ్‌నగర్‌లోని గర్ల్స్ మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పరిసరాలు, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, కాలేజీ రోడ్డు, గోదావరి నది తీర ప్రాంతాలతో పాటు మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు.

డ్రోన్ విజువల్స్ ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈవ్‌టీజింగ్, అనుమానాస్పదంగా సంచరించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, బాలికల వసతి గృహాలు, మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్, మహిళలు మరియు బాలికలను వేధించడం, వెంబడించడం వంటి చర్యలను పోలీసులు ఏమాత్రం సహించబోరని హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం మత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం, గొడవలకు పాల్పడటం, మహిళలు మరియు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని డీసీపీ తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంతో పాటు నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోని సున్నిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, బాలికల వసతి గృహాల పరిసరాలు, నదీతీర ప్రాంతాలు, మైదానాల్లో ప్రత్యేక డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.

ప్రజల భద్రత, మహిళలు మరియు విద్యార్థినుల రక్షణ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని డీసీపీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావుతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!