రోజూ ఒకే రకమైన అల్పాహారం తింటూ బోర్ కొడుతోందా? అయితే కాస్త వెరైటీగా, రుచికరంగా ఉండే సూజీ చిల్లా పిజ్జాను ప్రయత్నించండి. సాధారణ పిజ్జాకు ఉపయోగించే పిండికి బదులుగా ఇందులో బొంబాయి రవ్వను ఉపయోగిస్తారు. పెరుగు, కూరగాయలు, చీజ్‌తో తయారయ్యే ఈ వంటకం రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా బొంబాయి రవ్వలో పెరుగు, కొద్దిగా ఉప్పు, నీరు వేసి చిల్లా పిండిలా కలుపుకోవాలి. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వేడి పాన్‌పై ఈ మిశ్రమాన్ని గుండ్రంగా పోసి కాల్చాలి. అనంతరం దానిపై పిజ్జా సాస్ రాసి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా, స్వీట్ కార్న్ వంటి కూరగాయలను వేసుకోవాలి. చివరగా తురిమిన చీజ్ వేసి మూత పెట్టి తక్కువ మంటపై చీజ్ కరిగే వరకు ఉడికించాలి.
చీజ్ కరిగి, చిల్లా కింది భాగం కాస్త క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు అల్పాహారంగా, పెద్దలకు సాయంత్రం స్నాక్‌గా కూడా ఇది మంచి ఆప్షన్. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ సూజీ చిల్లా పిజ్జాను మీకు నచ్చిన కూరగాయలు, మసాలాలతో మరింత రుచికరంగా చేసుకోవచ్చు.








