E-PAPER

స్టార్‌లింక్‌తో పోటీకి సై..! మేం భయపడం..! మస్క్‌ కు రిలయన్స్‌ కౌంటర్‌..

ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవల్లో స్టార్‌లింక్‌ సహా ఏ సంస్థతోనైనా పోటీకి సిద్ధంగా ఉన్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పష్టం చేసింది. భారతీయ, విదేశీ సంస్థలన్నింటికీ దేశంలో ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించేందుకు ఎదురవుతున్న నియంత్రణపరమైన అడ్డంకులపై ఎలాన్‌ మస్క్‌ విమర్శలు చేసిన నేపథ్యంలో రిలయన్స్‌ ఈ ప్రకటన చేసింది.

భారత్‌లో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలను స్వాగతించే వాతావరణం ఉందని రిలయన్స్‌ పేర్కొంది. అయితే దేశ చట్టాలు, విధానాలకు లోబడి ప్రతి సంస్థ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ విధానం ప్రకారం దేశీయ, విదేశీ సంస్థలకు ఒకే విధమైన ప్రక్రియ వర్తిస్తుందని తెలిపింది. జియో ఉపగ్రహ సేవలకు సైతం ఇంకా అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించింది.

పోటీని స్వాగతిస్తున్నాం
పోటీకి తాము ఎప్పుడూ భయపడలేదని, వినియోగదారులకు మెరుగైన సేవలు ఎవరు అందిస్తున్నారో నిరూపించుకునేందుకు పోటీనే సరైన పరీక్ష అని రిలయన్స్‌ పేర్కొంది. 2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పుడు జియోకు ఒక్క వినియోగదారుడు కూడా లేడని గుర్తుచేసింది. పదేళ్లలో 53 కోట్లకు పైగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించామని, ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరల్లో డేటా సేవలను, మెరుగైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని తెలిపింది.

అంబానీపై మస్క్‌ వ్యంగ్యాస్త్రాలు
భారత్‌లో ఉపగ్రహ కమ్యూనికేషన్‌ సేవలు అందించేందుకు స్టార్‌లింక్‌కు లైసెన్స్‌ లభించింది. అయితే వాణిజ్య సేవలు ప్రారంభించాలంటే భద్రతాపరమైన అనుమతులతోపాటు మరికొన్ని ఆమోదాలు పొందాల్సి ఉంది.

స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించే అంశంపై గత వారం ఎలాన్‌ మస్క్‌.. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అంబానీని వ్యంగ్యంగా ‘ప్రధాని అంబానీ’ అని సంబోధించారు. భారత మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని అంబానీ కోరుకుంటున్నారని ఆరోపిస్తూ, స్టార్‌లింక్‌ను పోటీకి అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.

భారత్‌లో అసలైన అధికారం అంబానీ చేతుల్లో ఉందన్నట్లుగా ఇటీవల మస్క్‌ ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన ప్రభావాన్ని గుర్తించలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రిలయన్స్‌ తన వైఖరిని స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!