రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మనం మాత్రం మేల్కొని ఉంటే.. చిన్న విషయాలు కూడా పదేపదే గుర్తొస్తుంటాయి. ఉదయం పంపిన మెసేజ్‌కు రిప్లై రాకపోతే పగటిపూట పెద్దగా పట్టించుకోకపోయినా, అర్ధరాత్రి అదే విషయం గురించి “ఎందుకు రిప్లై ఇవ్వలేదు?”, “ఏమైనా జరిగిందా?”, “నాతో మాట్లాడటం ఇష్టం లేదా?” వంటి ప్రశ్నలు మొదలవుతాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి రూమినేషన్ (Rumination). అంటే ఒకే విషయాన్ని పదేపదే ఆలోచిస్తూ దానిలోనే చిక్కుకుపోవడం.
పగటిపూట మన చుట్టూ పని, ఫోన్, మనుషులు, ప్రయాణం వంటి ఎన్నో పనులు, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దీంతో చిన్న సమస్యపై ఎక్కువగా ఆలోచించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే సమాచారం తగ్గిపోవడంతో మన దృష్టి పూర్తిగా మన ఆలోచనలపైకి మళ్లుతుంది. అప్పుడు ఉదయం జరిగిన చిన్న సంఘటనను మెదడు పదేపదే విశ్లేషిస్తూ.. దానికి లేనిపోని అర్థాలను జోడించి పెద్ద సమస్యగా భావించే అవకాశం ఉంటుంది.
అయితే రాత్రివేళ వచ్చే ప్రతి ఆలోచన నిజం కావాల్సిన అవసరం లేదు. “మెసేజ్‌కు రిప్లై రాలేదు” అనేది వాస్తవం కావచ్చు.. కానీ “వాళ్లకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు” అనేది కేవలం మన ఊహ మాత్రమే కావచ్చు. అందుకే అర్ధరాత్రి ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా, “దీన్ని ఉదయం ప్రశాంతంగా ఆలోచిస్తాను” అని మనసుకు చెప్పుకోవడం మంచిది. రాత్రి 2 గంటలకు పెద్ద సమస్యగా కనిపించిన విషయం.. ఉదయం నిద్ర తర్వాత చాలా చిన్నదిగా అనిపించవచ్చు.








