రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతున్నామని, కాబట్టి ఆరోగ్యానికి పెద్దగా హాని ఉండదని చాలామంది భావిస్తుంటారు. కానీ పరిశోధనలు మాత్రం దీనికి భిన్నమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. రోజుకు ఒక సిగరెట్ తాగడం కూడా గుండె, రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రోజుకు ఒక్కటి నుంచి ఐదు సిగరెట్లు తాగే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు BMJలో ప్రచురితమైన 141 అధ్యయనాల మెటా-అనాలిసిస్ వెల్లడించింది.
రోజుకు ఒక్క సిగరెట్ తాగే పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎప్పుడూ ధూమపానం చేయని వారితో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే స్ట్రోక్ ముప్పు కూడా పెరుగుతున్నట్లు తేలింది. ముఖ్యంగా రోజుకు ఒక్క సిగరెట్ తాగడం వల్ల 20 సిగరెట్లు తాగే వారితో పోలిస్తే ప్రమాదం కేవలం 20వ వంతు మాత్రమే ఉంటుందని భావించడం తప్పని అధ్యయనం సూచించింది. ఒక సిగరెట్ మాత్రమే తాగేవారిలో కూడా 20 సిగరెట్లు తాగేవారికి సంబంధించిన అదనపు హృద్రోగ, స్ట్రోక్ ప్రమాదంలో సుమారు 40–50 శాతం వరకు ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.
అందువల్ల సిగరెట్ల సంఖ్యను తగ్గించడం వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల నుంచి పూర్తిగా రక్షణ పొందాలంటే ధూమపానాన్ని పూర్తిగా మానేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక్క సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందని భావించడం సరైనది కాదని గుర్తుంచుకోవాలి.








