సాధారణంగా బీరకాయతో పప్పు, కూర, వేపుడు వంటి వంటకాలు చేసుకుంటాం. అయితే బీరకాయ తొక్కను మాత్రం చాలామంది తీసి పడేస్తుంటారు. కానీ ఈ తొక్కను కూడా రుచికరమైన పచ్చడిగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా నువ్వులతో కలిపి తయారుచేసే బీరకాయ తొక్క రోటి పచ్చడి అన్నం, ఇడ్లీ, దోశతో ఎంతో రుచిగా ఉంటుంది.
ముందుగా బీరకాయ తొక్కలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో బీరకాయ తొక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. అనంతరం చింతపండు, ఉప్పు, అవసరమైనంత వెల్లుల్లి వేసుకుని అన్ని పదార్థాలను కలిపి చల్లార్చాలి.
చల్లారిన మిశ్రమాన్ని రోటి పచ్చడి మాదిరిగా రుబ్బుకోవాలి. చివరగా తాలింపు కోసం నూనెలో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పచ్చడిపై పోయాలి. అంతే.. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్క నువ్వుల రోటి పచ్చడి సిద్ధం. తొక్కను పడేయకుండా ఇలా ఉపయోగించుకోవడం వల్ల వంటలో వేస్ట్ తగ్గించుకోవడంతో పాటు భోజనానికి కొత్త రుచిని కూడా జోడించవచ్చు.








