భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29: హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేస్తూ 70MM యూట్యూబ్ ఛానల్లో రూపొందించిన సందేశాత్మక షార్ట్ ఫిలిం ‘నిర్లక్ష్యం’ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా షార్ట్ ఫిలింను పూర్తిగా వీక్షించిన ఎస్పీ, సన్నివేశాలు సహజసిద్ధంగా ఉన్నాయని, నటీనటులందరూ చక్కగా నటించారని ప్రశంసించారు. దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ పనితీరును అభినందిస్తూ, షార్ట్ ఫిలింలోని లోటుపాట్లను కూడా వివరించారు.
ప్రస్తుతం ప్రేక్షకులు తక్కువ నిడివి గల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని పేర్కొన్న ఎస్పీ, తక్కువ సమయంలోనే మంచి సందేశాన్ని అందించేలా షార్ట్ ఫిలింలను రూపొందించాలని సూచించారు. సమాజాన్ని చైతన్యపరిచే, ప్రజలను ఆలోచింపజేసే సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించాలని తెలిపారు. టీం సభ్యుల వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం షార్ట్ ఫిలిం టీం సభ్యులు ఎస్పీ రోహిత్ రాజ్‌ను శాలువాతో సత్కరించారు. తమ పది నిమిషాల షార్ట్ ఫిలింను పూర్తిగా వీక్షించి, ప్రతి సన్నివేశాన్ని పరిశీలించి, నటీనటులను అభినందించినందుకు ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ, నటీనటులు జలాల్, ఆవుదుర్తి సతీష్, ప్రేమ్ సాగర్ బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.








