టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తూనే, ఖర్చులను నియంత్రించేందుకు ఈ నెలలో కొత్త లేఆఫ్స్ చేపట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఒరాకిల్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్స్‌కు గురయ్యే ఉద్యోగులను గుర్తించాలని ఒరాకిల్ మేనేజర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1న కంపెనీ రెండో ఆర్థిక త్రైమాసికం ప్రారంభం కానున్న నేపథ్యంలో, అంతకంటే ముందే ఉద్యోగాల కోతలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్య రెండంకెల శాతంలో తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఒకవైపు AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచుతున్న ఒరాకిల్.. మరోవైపు ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించే చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఎన్ని ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.








