టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి క్షిపణి దాడి ముప్పు ఉందన్న నిఘా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రయాణానికి సంబంధించిన విమానాన్ని రహస్యంగా మార్చినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. ఇరాన్ నుంచి దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఈ అసాధారణ చర్య చేపట్టినట్లు పేర్కొంది.
జూలై 8న నాటో సదస్సు చివరి రోజున ట్రంప్ అంకారా నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా నిఘా సంస్థలకు ఈ ముప్పుపై సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్ వన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో దాడి జరిగే అవకాశం ఉందని పలు మార్గాల ద్వారా నిఘా సమాచారం వచ్చినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఈ సమాచారంతో ట్రంప్ భద్రతకు సంబంధించి అమెరికా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముప్పు ఎంతవరకు విశ్వసనీయమైనది, విమానం మార్పు సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు అనే వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.








