E-PAPER

ఒక పాఠశాల ఘటనకు మరో పాఠశాల ఫోటో ప్రచురించడం సరికాదు: ఎమిలీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గోపీనాథ్

అశ్వాపురం, జూలై 20 (వై7 న్యూస్): జర్నలిజం అంటే ప్రజలకు నిజాలను తెలియజేయడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్ప వ్యక్తులు లేదా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం కాదని ఎమిలీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ములకలపల్లి గోపీనాథ్ అన్నారు.

ఒక పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధం లేని మరో పాఠశాల ఫోటోను ప్రచురించడం జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టు ఎంతకాలం పనిచేశాడన్నది కాకుండా, వార్తలను ఎంత నిజాయితీగా, బాధ్యతతో, నిష్పాక్షికంగా ప్రజలకు అందిస్తున్నాడన్నదే ముఖ్యమన్నారు.

ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారి పాఠశాలను తనిఖీ చేసి మౌలిక వసతులపై నివేదిక సమర్పించినప్పటికీ, అదే పాఠశాలను పదేపదే లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రచురించడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలే ఆలోచించాలని అన్నారు.

పత్రికా స్వేచ్ఛ అంటే ఎవరి ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదని, ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందించడం, అన్ని పక్షాల వాదనలను సమానంగా వినిపించడమే మీడియా ధర్మమని చెప్పారు. ప్రజల్లో అపోహలు కలిగించేలా లేదా విద్యాసంస్థలపై అనవసర అనుమానాలు రేకెత్తించేలా వార్తలు ప్రచురించడం సమాజానికి మేలు చేయదన్నారు.

తమ పాఠశాలలో తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి మౌలిక వసతులు, బోధన విధానం, క్రమశిక్షణ, ఫీజు నిర్మాణం పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే తమ పిల్లలను చేర్పిస్తున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా పాఠశాలపై అనుమానాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు.

సద్విమర్శను ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే వాస్తవాలను పక్కనబెట్టి ఒకే పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వరుస కథనాలు ప్రచురించడం జర్నలిజం కాదని అన్నారు. వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి అన్ని వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

పత్రికా స్వేచ్ఛను సమాజ హితం కోసం వినియోగించాలి తప్ప, ఏ విద్యాసంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే సాధనంగా మార్చకూడదని గోపీనాథ్ స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News