E-PAPER

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, జూలై 20 (వై7 న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల సమన్వయంతోనే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, త్రాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.

జూలై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, భూగర్భ జలాలు రానున్న రెండు నెలల్లో మరింత తగ్గే అవకాశం ఉందని భట్టి హెచ్చరించారు.

ప్రతి రైతుకు వర్షపాతం లోటు, నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై స్పష్టమైన సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది, ఈ ఏడాది నీటి నిల్వలు, జలాశయాల పరిస్థితిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లో సాగునీరు వచ్చే అవకాశం లేదని, పాలేరు ఆయకట్టుకు కూడా సాగునీరు అందుబాటులో ఉండదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. వరి వంటి నీటి అధిక అవసరమున్న పంటలకు బదులుగా పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో త్రాగునీటి అవసరాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ వనరులను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే గోదావరి బ్యాక్‌వాటర్‌ను వినియోగించి చెరువులు నింపే అవకాశాలను పరిశీలించాలని ఇంజినీర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రైతులను ఆయిల్‌పామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సమావేశంలో ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రి ఎల్‌నినో పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!