రాత్రి మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన అన్నంతో చాలా తక్కువ సమయంలో చేసుకునే రుచికరమైన వంటకం కారపన్నం. ప్రత్యేకంగా కూరలు అవసరం లేకుండానే కారంగా, పుల్లగా ఉండే ఈ రైస్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.
కారపన్నం తయారీకి అన్నం, కారం, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పల్లీలు, ఉల్లిపాయ, పోపు దినుసులు, ఎండుమిర్చి, నూనె అవసరం. ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, పల్లీలు వేయించి, తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి స్వల్పంగా వేయించాలి.
చివరగా ఉడికిన అన్నం వేసి మసాలా బాగా కలిసేలా కలపాలి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా పెరుగు, అప్పడం లేదా ఉల్లిపాయ ముక్కలతో వడ్డిస్తే కారపన్నం మరింత రుచిగా ఉంటుంది.








