E-PAPER

వసతిగృహ విద్యార్థులకు శుభవార్త.. డైట్ ఛార్జీలు 10% పెంపు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అధికారులు సూచించినా, విద్యార్థుల పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెంపును అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్య ద్వారానే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్ల స్థానంలో ఆధునిక గురుకులాలు (రెసిడెన్షియల్ స్కూళ్లు) నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా తీర్చిదిద్దాలని, నెట్‌జీరో విధానం, బయోడైవర్సిటీ పార్కుల తరహా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

హాస్టళ్లు, గురుకులాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. తక్షణ మరమ్మత్తుల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తూ, విద్యార్థులకు మెరుగైన వసతి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News