200 మందికి పైగా బాధితులు..
ప్రధాన నిందితుడు తంగుడు శ్రీధర్ అరెస్ట్, రిమాండ్
లాస, జూలై 8 (వై7 న్యూస్): కరుణ్య లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు తంగుడు శ్రీధర్‌ను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం, కరుణ్య లక్కీ స్కీమ్‌లో చేరితే తక్కువ పెట్టుబడితో విలువైన బహుమతులు, నగదు రాబడులు, అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి పలాస, కాశీబుగ్గతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రారంభంలో కొంతమందికి బహుమతులు అందించి విశ్వాసం కల్పించిన నిందితుడు, అనంతరం భారీ మొత్తంలో డబ్బు సేకరించి బాధితులకు అందుబాటులో లేకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సేకరించిన ఆధారాల ఆధారంగా ప్రధాన నిందితుడు తంగుడు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. ఈ కేసులో మరిన్ని బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక లాభాలు, లక్కీ స్కీమ్‌లు, త్వరగా డబ్బు రెట్టింపు చేస్తామంటూ ప్రలోభపెట్టే వ్యక్తులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.








