ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. యోగ్యకర్త సమీపంలో ఉన్న ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సాంస్కృతిక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఆలయానికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి కనిపించిన ప్రంబనన్ ఆలయ వైభవాన్ని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ.. “అద్భుతమైన ప్రంబనన్ ఆలయం” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రంబనన్ ఆలయ సముదాయం సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమానికి భారత్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఆలయ పునరుద్ధరణ కోసం ఇరు దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్-ఇండోనేషియా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, సాంస్కృతిక సహకారంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని లక్ష్యంగా చేసుకుని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ఒప్పందం ఈ భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.








