విశాఖపట్నంలోని రుషికొండ భవనాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. భవనాల వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI)’ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన రుషికొండ భవనాల వినియోగాన్ని ప్రశ్నిస్తూ విశాఖకు చెందిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్ కోరగా, చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని కోర్టు స్పష్టం చేస్తూ విచారణను కొనసాగించింది.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై అప్పట్లో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి వినియోగంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన అంశాలను హైకోర్టు మరింతగా పరిశీలించనుంది.









