వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం రాజకీయ అణచివేత కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో చిన్నారులు అదృశ్యమైన ఘటనలు, మహిళలపై నేరాలు, గిరిజన మహిళపై దాడి వంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా సాగడం లేదని జగన్ విమర్శించారు. అయితే ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు నమోదు చేసి, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు దాటినా ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారని పేర్కొన్నారు.
సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్‌లు, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.
యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తీవ్రవాదులకు వర్తించేలా కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని జగన్ అన్నారు. రాష్ట్రానికి రౌడీ పోలీస్ రాజ్యం లేదా జంగిల్‌రాజ్ అవసరం లేదని, ప్రజలకు భద్రత కల్పించే, బాధితులకు న్యాయం చేసే, రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీసు వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.








