రోస్టర్ విధానం కారణంగా మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల రాజ్యాంగ హక్కులను దెబ్బతీస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ మాల ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ గ్రూప్‌లోని మాలలతో పాటు ఇతర 25 కులాలకు సంబంధించిన తొలి రోస్టర్ పాయింట్‌ను ప్రస్తుతం ఉన్న 22 నుంచి 16కు మార్చాలని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా ప్రయత్నిస్తానన్నారు.
మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో పాటు ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువత అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలో మార్పులు చేసి సామాజిక న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మహాధర్నాలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ ఎం. భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బి. కిషన్, గౌరవ అధ్యక్షుడు సీహెచ్. రాంచందర్, మాల ప్రజా ఫ్రంట్ వైస్ చైర్మన్ డి. విశాల్, కో-ఆర్డినేటర్లు నాందేవ్, అంజలి తదితర నాయకులు పాల్గొన్నారు.









