E-PAPER

హొర్ముజ్ జలసంధిలో సేవా రుసుము వసూలు చేస్తాం.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

 

హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భవిష్యత్తులో సేవా రుసుము (సర్వీస్ ట్యాక్స్) వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ఇరాన్ రాయబారి అబ్దుల్‌రెజా రెహమాన్ ఫాజ్లి వెల్లడించారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో మాట్లాడిన ఆయన, యుద్ధ సమయంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు ఈ రుసుములో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఆయన ప్రకారం, ఒమన్‌తో కలిసి హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. “హొర్ముజ్ మా దేశంలో అంతర్భాగం. అక్కడ నౌకల ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సేవల కోసం మేము సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తాం. ఇది టోల్ కాదు” అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే, ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హొర్ముజ్ జలసంధిలో 60 రోజుల పాటు ఎలాంటి టోల్ లేదా అదనపు రుసుము వసూలు చేయకూడదనే నిబంధన ఉన్నట్లు సమాచారం. ఆ గడువు తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందనే అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ రాయబారి చేసిన తాజా ప్రకటన ప్రపంచ వాణిజ్య, ఇంధన రంగాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హొర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో, అక్కడ ఎలాంటి కొత్త రుసుములు లేదా పరిమితులు అమలులోకి వచ్చినా అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News