E-PAPER

‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు.. వైరల్‌గా మారిన వీడియో

 

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘బేబి’ చిత్రానికి కథ అందించిన సాయి రాజేష్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయవాడ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన

సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో నిర్వహించిన ‘లవ్ కార్నివాల్’ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ ప్రసంగం సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, “నేను విజయవాడలోనే పెరిగాను. విజయవాడ అంటే నాకు ఇంద్రకీలాద్రి… ‘ఇంద్ర’ సినిమా గుర్తుకొస్తుంది” అని చెప్పగానే, అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా “జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్”, “బెజవాడ అంటే సింహాద్రి గడ్డ” అంటూ నినాదాలు చేశారు.

ఈ అనూహ్య పరిణామంతో ఎస్‌కేఎన్ కొద్దిసేపు మాట్లాడకుండా ఆగిపోయినా, అనంతరం చిరునవ్వుతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయవాడతో ప్రత్యేక అనుబంధం

తన ప్రసంగాన్ని కొనసాగించిన ఎస్‌కేఎన్, విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నా సొంత ఊరిలో మా సినిమా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అద్భుతమైన షూటింగ్ లొకేషన్లు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలోని ఎక్కువ భాగం షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించామని, బీచ్ ప్రాంతంలో భారీ లైట్‌హౌస్ సెట్ నిర్మించామని వెల్లడించారు. షూటింగ్‌కు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జూలై 24 నాకు ప్రత్యేకమైన తేదీ: ఎస్‌కేఎన్

జూలై 24 తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని ఎస్‌కేఎన్ పేర్కొన్నారు. “మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలు కూడా ఇదే తేదీన విడుదలయ్యాయి. మెగా అభిమానిగా ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు అదే రోజున ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదల కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.

అలాగే, సినిమా ప్రీమియర్ షోలు జూలై 23 నుంచే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News