నకిలీ వీసాలు, టికెట్లతో ఎనిమిది మందిని మోసం చేసిన నిందితుడు పోలీసుల అదుపులో
శ్రీకాకుళం జిల్లా పలాస, జూలై 4 (వై7 న్యూస్):
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మించి ఎనిమిది మంది నుంచి మొత్తం రూ.9.60 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పలాస మున్సిపాలిటీ పరిధిలోని జయరాంచంద్రపురం గ్రామానికి చెందిన పలువురు యువకులతో పాటు మెలియాపుట్టి మండలానికి చెందిన మరో బాధితుడికి గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మక్కా సురేష్ అనే వ్యక్తి హామీ ఇచ్చాడు. వీసా, విమాన టికెట్, ఉద్యోగ ఒప్పంద పత్రాలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున నగదు, ఆన్‌లైన్ చెల్లింపుల రూపంలో మొత్తం రూ.9.60 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని చెప్పిన సురేష్, మే 26న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాలని సూచించాడు. దీంతో బాధితులు అక్కడికి చేరుకోగా, వారికి అందజేసిన వీసాలు, విమాన టికెట్లు, ఉద్యోగ ఒప్పంద పత్రాలు నకిలీవని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. దీంతో తాము మోసపోయినట్లు బాధితులు తెలుసుకున్నారు.
తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా సురేష్ స్పందించకపోవడంతో బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు మక్కా సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.








