E-PAPER

ఎస్సీ కార్పొరేషన్ ఈవి వాహనాల పథకంలో పారదర్శకతపై సమగ్ర సమాచారం ఇవ్వాలి

RTI ద్వారా వివరాలు కోరిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ

ములుగు జిల్లా, అక్టోబర్ 06 (Y7 News Telugu):

ములుగు జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ (SC Corporation) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈవి వాహనాల పథకంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు రుణాలు, సబ్సిడీ మంజూరు, నిధుల విడుదల వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై పూర్తి వివరాలను వెల్లడించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 6(1) కింద RTI దరఖాస్తు సమర్పించినట్లు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా అధ్యక్షులు పసులాది ముఖేష్ తెలిపారు.

ఈ మేరకు SC Corporation ములుగు జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)కు దరఖాస్తు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ములుగు జిల్లాకు ఈవి వాహనాల పథకం కింద కేటాయించిన యూనిట్ల సంఖ్య, అందిన దరఖాస్తులు, అర్హత సాధించిన వారి సంఖ్య, అనర్హులుగా గుర్తించిన దరఖాస్తుల వివరాలను వెల్లడించాలని కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, అర్హత–అనర్హత వివరాలు, లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, పరిశీలన విధానం, కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు, కమిటీ సమావేశాల మినిట్స్, తుది లబ్ధిదారుల జాబితా, ఎంపిక కాకపోయిన దరఖాస్తుల తిరస్కరణ కారణాలు వంటి సమాచారాన్ని కూడా కోరినట్లు వెల్లడించారు.

ఎంపికైన లబ్ధిదారుల ప్రతిపాదనలు ఏయే బ్యాంకులకు పంపించారో, ఎన్ని రుణాలు మంజూరయ్యాయో, ఒక్కో లబ్ధిదారునికి మంజూరైన SC Corporation సబ్సిడీ, బ్యాంకు రుణం, లబ్ధిదారు వాటా ఎంత అనే వివరాలతో పాటు ఇప్పటివరకు విడుదలైన నిధులు, ఆర్థిక సహాయానికి సంబంధించిన రికార్డులను కూడా అందించాలని RTIలో కోరినట్లు తెలిపారు.

పథకం అమలుపై ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు వచ్చినట్లయితే వాటి వివరాలు, విచారణ నివేదికలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పసులాది ముఖేష్ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు నిబంధనల ప్రకారం అందుతున్నాయా లేదా అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఉండాలి. ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మా ఉద్దేశం కాదు. అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నదే మా లక్ష్యం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందనే నమ్మకాన్ని కల్పించేందుకు సంబంధిత అధికారులు పూర్తి సమాచారాన్ని వెల్లడించాలి” అని కోరారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి. సలీమ్ పాషా పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!