E-PAPER

ఏజెన్సీ నిరుద్యోగుల దీక్షలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ మద్దతు

జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ చట్టాన్ని తేవాలి: కుంజా శ్రీను

హక్కులు సాధనకు 7 న శాంతియుత ఐటీడీఏ ముట్టడికి నిరుద్యోగులు తరలి రావాలి

రంపచోడవరం,( వై7 న్యూస్ తెలుగు) అక్టోబర్ 06:
ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యోగ నియామకాల అన్యాయాలపై ప్రశ్నిస్తూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఏజెన్సీ నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత వారం రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోజులు తరబడి దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకుని నిరుద్యోగులను మభ్యపెట్టాలని చూస్తే ఏజెన్సీ నిరుద్యోగులు సహించే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఏజెన్సీ నిరుద్యోగ రణభేరి మోగించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
గతంలో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజన నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధి హక్కులకు పూర్తిస్థాయి చట్టభద్రత కల్పించేలా వెంటనే ఒక ప్రత్యామ్నాయ చట్టాన్ని (షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమక చట్టం) తీసుకురావాలని కుంజా శ్రీను డిమాండ్ చేశారు. దాంతో పాటు ఐటీడీఏల పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసి నిరుద్యోగుల హక్కుల సాధన కోసం అక్టోబర్ 7న నిర్వహించ తలపెట్టిన శాంతియుత “ఐటీడీఏ ముట్టడి” కార్యక్రమానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ న్యాయపోరాటంలో ఏజెన్సీలోని గిరిజన నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు మరియు గిరిజన మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని ‘ఐటీడీఏ ముట్టడి’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!