E-PAPER

పాక్ మంత్రికి షాక్..! తాజ్‌మహల్, దర్గాకు నో ఎంట్రీ..! షాంఘై సదస్సుకే పరిమితం..!

షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు నిమిత్తం భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ వ్యక్తిగత పర్యటనలకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో నవంబరు 20 నుంచి 22 వరకు జరుగుతున్న ఎస్‌సీవో వేదికకే ఆయన రాకను పరిమితం చేస్తూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

భారత పర్యటన సందర్భంగా ఆగ్రాలోని ప్రపంచ వింత తాజ్‌మహల్‌తో పాటు, ఢిల్లీలోని ప్రసిద్ధ నిజాముద్దీన్ దర్గాను దర్శించుకోవాలని ముసాదిక్ మాలిక్ భావించారు. ఇందుకోసం అనుమతులు కోరగా, ఎస్‌సీవో అధికారిక సమావేశాలు మినహా ఇతర ప్రాంతాల సందర్శనకు అనుమతించేది లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. కేవలం సదస్సులో పాల్గొనడానికి మాత్రమే వీసా మంజూరైందని, అధికారిక వేదికను దాటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

2023లో గోవాలో జరిగిన ఎస్‌సీవో సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ వచ్చిన తర్వాత, పాకిస్థాన్ మంత్రి భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 2025 పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాలిక్‌ను సదస్సుకు ఆహ్వానించడంపై ఇప్పటికే దేశీయంగా విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తుండగా, ప్రభుత్వం ఆయన కదలికలపై గట్టి నిఘా ఉంచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!