E-PAPER

డిసెంబరు నాటికి స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతం పెరిగే ఛాన్స్..!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఏడాది ముగిసే నాటికి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు 30 శాతానికి పైగా పెరిగి ఒక్కో ఫోన్ ధర రూ.లక్ష దాటే అవకాశం ఉందని మార్కెట్ పరిశోధన సంస్థ ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మెమొరీ చిప్‌ల ధరలు అనూహ్యంగా పెరగడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల నుంచి డీరామ్, న్యాండ్ మెమొరీ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఫోన్ల తయారీ వ్యయంలో మెమొరీ వాటా 2025 మొదటి త్రైమాసికంలో 13 శాతంగా ఉండగా, 2026 డిసెంబరు నాటికి ఏకంగా 43 శాతానికి చేరుతుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. గతంలో భారతదేశంలో రూ.లక్ష ధర పలికే ఫోన్లు చాలా అరుదుగా ఉండేవని, నేడు ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఈ ధర సర్వసాధారణంగా మారుతోందని నివేదిక స్పష్టం చేసింది.

నివేదిక ప్రకారం.. ప్రముఖ బ్రాండ్లలో ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 82 నుంచి 87 శాతం వరకు పెరిగాయి. అల్ట్రా ప్రీమియం విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ ధరలు 20 నుంచి 22 శాతం వరకు పెరిగాయి. యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజాల ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రూ.2 లక్షల మార్కు వైపు పరుగులు తీస్తుండటంతో ఐకూ, గూగుల్ వంటి బ్రాండ్లు పోటీ ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే శాంసంగ్ సంస్థ దీపావళి తర్వాత తన ఫోన్ల ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 వరకు పెంచగా, అంతకుముందు గెలాక్సీ ఎస్26 ధరను 17 శాతం పెంచింది. చైనీస్ బ్రాండ్ షావోమి సైతం దీపావళి తర్వాత ఇదే స్థాయిలో ధరలను సవరించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!