మణుగూరు, అక్టోబర్ 6 (Y7 న్యూస్ తెలుగు): పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు వ్యర్థాల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా మణుగూరు ఏరియా ఆసుపత్రి, జీఎం కార్యాలయ ప్రాంగణాల్లో మంగళవారం ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాలను చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతోందని, వాటి వల్ల ఉత్పత్తి అయ్యే ఈ-వేస్ట్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం అత్యంత అవసరమని అన్నారు.
ఉపయోగంలో లేని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తదితర వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్‌కు పంపాలని సూచించారు. ఈ-వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించడం ద్వారా పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు విలువైన సహజ వనరులను సంరక్షించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ ఎస్. సురేష్ ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను నిర్దేశిత విధానంలో మాత్రమే పారవేయాలని, వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా మణుగూరు ఏరియాలోని కార్యాలయాలు, ఆసుపత్రులు మరియు ఇతర విభాగాల్లో వినియోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించి సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సేకరించిన ఈ-వేస్ట్‌ను నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ కోసం తరలించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామారావు, ఏజీఎం (సివిల్) సిహెచ్. రాంబాబు, ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేష్, డీజీఎం (సివిల్) జి. శివ ప్రసాద్, డిప్యూటీ సీఎంఓ డా. ఎం. జ్యోతిర్మయి, పర్యావరణ అధికారి జె. శ్రీనివాసరావు, ఫైనాన్స్ మేనేజర్ పి. రమేష్, ఏరియా సెక్యూరిటీ అధికారి కే. శ్రీనివాస్‌తో పాటు వైద్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.









