మంగపేట మండలంలో వైన్ షాపులు లేకపోయినా ఏరులై పారుతున్న మద్యం
నాగారం వైన్ షాపుల నుంచే నిత్యం లక్షల రూపాయల సరుకు అక్రమ రవాణా
మండలంలో 500కు పైగా బెల్ట్ షాపులు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
ములుగు ,అక్టోబర్ 06 ( వై 7 న్యూస్ తెలుగు );
మంగపేట మండలంలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. అధికారికంగా మండల పరిధిలో మద్యం దుకాణాలు లేకపోయినా, ఊరూరా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిసి నిత్యం లక్షల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి, ఎంఆర్‌పీ (MRP) కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు.
వైన్ షాపుల్లేవు.. కానీ మద్యం ఏరులై పారుతోంది!
మంగపేట మండల పరిధిలో సుమారు పదేళ్లకు పైగా ఎలాంటి మద్యం దుకాణాలు లేవు. అయినప్పటికీ మండలంలో మద్యం ఏమాత్రం కొరత లేకుండా దొరుకుతోంది. పొరుగున ఉన్న నాగారం, రామనగర్, కాటారం ప్రాంతాల్లోని వైన్ షాపుల నుంచే మంగపేట మండలానికి భారీ ఎత్తున మద్యం సరుకు తరలిస్తున్నారు. మంగపేటలోని ప్రతి పల్లెకూ వాహనాలు, ఆటోల్లో రోజూ మద్యం చేరుతోంది.
ఎంఆర్‌పీకి తూట్లు.. బాటిల్‌పై ₹40 నుంచి ₹80 దాకా అదనపు భారం!
నాగారంలోని ప్రధాన వైన్ షాపుల వద్దే ఎంఆర్‌పీ ధరలను తుంగలో తొక్కుతున్నారు. మద్యం సిండికేట్ కారణంగా వైన్ షాపుల నిర్వాహకులు ప్రతి బాటిల్‌పై నేరుగా ₹20 అదనంగా వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చిన సరుకును స్థానిక బెల్ట్ షాపు నిర్వాహకులు మరో ₹20 కలిపి క్వార్టర్ బాటిల్‌కు ₹40 అదనంగా విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఎంఆర్‌పీ ₹180 ఉన్న మ్యాన్షన్ హౌస్ క్వార్టర్‌ను బెల్ట్ షాపు యజమానికి వైన్ షాపు వారు ₹200కి ఇస్తుండగా, వినియోగదారుడికి వచ్చేసరికి అది ₹220 నుండి ₹230కి అమ్ముతున్నారు. అదే ఫుల్ బాటిల్ అయితే ఎంఆర్‌పీ కంటే సుమారు ₹80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం కాకుండా ఇతర బ్రాండ్లను ఎక్కువగా ఎంఆర్‌పీ కౌంటర్లలో పెట్టి, డిమాండ్ ఉన్న సరుకును మాత్రం అధిక రేట్లకు అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
500కు పైగా బెల్ట్ షాపులు.. నిత్యం లక్షల వ్యాపారం
మంగపేట మండలం వ్యాప్తంగా సుమారు 500 నుండి 600 వరకు బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బెల్ట్ షాపు నిర్వాహకుడు నిత్యం ₹5,000 నుంచి ₹10,000 విలువైన మద్యాన్ని నాగారం నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇలా మండలంలో రోజుకు సుమారు లక్ష మద్యం సీసాల విక్రయాలు సాగుతున్నాయని, దీని ద్వారా రోజువారీగా లక్షల రూపాయల అదనపు అక్రమ సంపాదన మద్యం మాఫియా చేతుల్లోకి వెళ్తోందని స్పష్టమవుతోంది.
నిమ్మకు నీరెత్తినట్లు ఎక్సైజ్ యంత్రాంగం!
ఇంత బహిరంగంగా మద్యం అక్రమ రవాణా, అధిక ధరల దోపిడీ జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మద్యం సిండికేట్‌తో కుమ్మక్కై, వారి సరుకును అడ్డుకోకుండా వదిలేస్తున్నారని, సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే వారిపైనే హడావుడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మంగపేట పరిధిలో బెల్ట్ షాపులను అరికట్టడంతో పాటు నాగారం మద్యం దుకాణాల సిండికేట్ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.









