దేవుడి భూములకే ఎసరు..?
మూడేళ్ల కమిటీకి దేవుడి స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకిచ్చే అధికారం ఎక్కడిది..?
*రామాలయంతో సమానంగా బాబా ఆలయానికి ఆస్తులు.. పట్టించుకోని అధికారులు.!*
రికార్డులు లేవు.. అందరూ పెట్టారని నేనూ బోర్డు పెట్టా..అంటున్న ప్రస్తుత ఈవో
ఆలయ భూములను వెంటనే సర్వే చేసి రికార్డులు బయటపెట్టాలి స్థానిక ప్రజలు…
భద్రాచలం (వై సెవెన్ న్యూస్ బ్యూరో):

భద్రాచలం పుణ్యక్షేత్రంలో మరో భారీ భూముల బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ శ్రీ కుసుమ హరనాథ బాబా ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో దాతలు ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రాలు, దేవస్థానంలో ఏర్పాటు చేసిన సర్వే నంబర్ల రికార్డుల బోర్డులే మాయమైపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా 99 ఏళ్లకు లీజులు కట్టబెడుతూ, దేవుడి మాన్యాలను సొంతానికి వాడేసుకుంటున్న వైనంపై ప్రస్తుత అధికారులను వై 7 న్యూస్ ప్రశ్నిస్తే “మాకేం తెలీదు.. రికార్డులే లేవు” అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ భూదందా వెనుక ఉన్నది ఎవరు? రాజేశ్ తమ్మల్ల అందిస్తున్న వై సెవెన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్…
వివరాల్లోకి వెలితే భద్రాచలం పుణ్యక్షేత్రంలో కుసుమ హరనాథ బాబా ఆలయానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలాలు, మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దాతలు ఆలయానికి రాసిచ్చిన వీలునామా పత్రాలు, దేవస్థానంలో గతంలో ఏర్పాటు చేసిన సర్వే నంబర్ల రికార్డుల బోర్డులే మాయమైపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
*బావి పూడ్చివేత.. అక్రమ నిర్మాణాలు!*
పట్టణంలోని పాత ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా, ఐస్ మ్యాజిక్ పక్కన ఉన్న ఆలయ స్థలంలో ప్రస్తుతం భారీగా గుంతలు తవ్వి పిల్లర్లు వేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో దేవుడి నివేదన, తీర్థం కోసం ‘రేపాక’ వంశీకులు బావి తవ్వించి, తమ తదనంతరం ఈ స్థలాన్ని బాబా ఆలయానికే చెందేలా వీలునామా రాశారని సమాచారం. అయితే, ప్రస్తుతం ఆ బావిని పూడ్చివేసి నిర్మాణాలు చేస్తుండటంపై ప్రశ్నించగా, ఆలయం వద్ద ఎలాంటి రికార్డులు లేవని ప్రస్తుత ఈవో చెప్పడం గమనార్హం. “అందరూ బోర్డు పెట్టారు.. నేను పెట్టాను” అంటూ ఈవో బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*మాయమైన బ్లాక్‌బోర్డు.. నాటి రికార్డులేవీ?*
ఈ వ్యవహారంపై ఆలయ మాజీ ఛైర్మన్ బండారు సుధాకర్ వివరణ ఇస్తూ, గతంలో కుసుమ హరనాథ బాబా ఆలయానికి రామాలయంతో సమానంగా ఇతర రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఆస్తులు ఉండేవని స్పష్టం చేశారు. భక్తులకు, ప్రజలకు తెలియజేసేందుకు ఆస్తులు, సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాలతో దేవాలయంలో ఒక పెద్ద బ్లాక్‌బోర్డును సైతం ఏర్పాటు చేయించామని, ఇప్పుడా రికార్డులను ఎందుకు తొలగించారో అధికారులే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఏజెన్సీ 1/70 చట్టానికి విరుద్ధంగా వ్యవసాయ భూములను అనుభవిస్తున్న వారి నుంచి దండోరా వేయించి ఓపెన్ ఆక్షన్ ద్వారా ఆలయానికి ఆదాయం తెచ్చామని గుర్తుచేశారు.
*99 ఏళ్ల లీజుల బాగోతం*
పాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని ప్రధాన స్థలాన్ని గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 99 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసి కట్టబెట్టారని మాజీ ఛైర్మన్ ఆరోపించారు. మూడేళ్ల కాలపరిమితి ఉండే కమిటీలకు దేవుడి భూములను 99 ఏళ్లకు లీజుకిచ్చే అధికారం బైలా ప్రకారం ఉండదని, ఇది ఆస్తిని శాశ్వతంగా వదులుకోవడమేనని మండిపడ్డారు. ఇది కాకుండా సీఆర్‌పీఎఫ్ (CRPF) క్యాంప్ వద్ద, రాజీవ్‌నగర్ కాలనీ, రూపా స్కూల్ పక్కన ఉన్న భూములు సైతం ఆక్రమణల కోరల్లో చిక్కుకున్నట్లు తెలిపారు.
సిబ్బందికి అన్యాయం.. అధికారుల నిర్లక్ష్యం
ప్రభుత్వ ఈవోలకు జీతాలు ఠంచనుగా వస్తున్నప్పటికీ, ఆలయంలో పనిచేసే పూజారులు, ఎన్‌ఎమ్‌ఆర్ (NMR) తాత్కాలిక సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందక గతంలోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమిషనర్, ఈవో వద్ద ఉన్న పాత రికార్డులను బయటకు తీసి, గతంలో పనిచేసిన గుమస్తాలను విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కుసుమ హరనాథ బాబా ఆలయ భూములను సమగ్రంగా సర్వే చేయించి, ఆక్రమణలను అడ్డుకోవాలని భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.









