E-PAPER

ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 16 కేజీల గంజాయి స్వాధీనం

ఇద్దరు అరెస్ట్.. ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 News Telugu

ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఇచ్చాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. చిన్నానాయుడు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇచ్చాపురం పట్టణ ఎస్‌ఐ ఎం. ముకుందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 కేజీల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, Hero HF Deluxe ద్విచక్ర వాహనం (OD 07 AL 8796)ను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా అరెస్టయిన సునీల్ కుమార్ అలియాస్ మోహిత్ జైస్వాల్ వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు కావడంతో గంజాయి వ్యాపారం చేస్తున్న అమిత్ అలియాస్ నకుల్ కుమార్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకువస్తే రూ.10 వేల పారితోషికం ఇస్తానని అమిత్ చెప్పడంతో సునీల్ కుమార్ అంగీకరించినట్లు విచారణలో వెల్లడైంది.

ఇప్పటికే పలుమార్లు అమిత్, సునీల్ కుమార్‌లు ఒడిశాలోని లక్ష్మీకాంత్ గౌడ వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈసారి కూడా సుమారు 16 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తరలించే ప్రయత్నంలో ఉన్నట్లు తేలింది.

గంజాయి రవాణా కోసం లక్ష్మీకాంత్ గౌడ, సూర్యనారాయణ గౌడకు ద్విచక్ర వాహనం సమకూర్చినట్లు, అనంతరం వారు బరంపురం చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. బరంపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీలు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి సూర్యనారాయణ గౌడ ద్విచక్ర వాహనంపై గంజాయి ఉన్న సూట్‌కేస్, లగేజీ బ్యాగులతో సునీల్ కుమార్‌ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!