కాకతీయుల నిర్మాణ పరిజ్ఞానం అద్భుతమని కొనియాడిన బృందం
ములుగు, అక్టోబర్ 4 (Y7 News Telugu): యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ శిల్పవైభవం విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. కాకతీయుల నిర్మాణ పరిజ్ఞానం, శిల్పుల కళానైపుణ్యం అద్భుతమని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సాంకేతిక, ఆర్థిక సహకార (ITEC) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న రెండు వారాల సామర్థ్య వికాస శిక్షణలో పాల్గొంటున్న 18 దేశాలకు చెందిన 28 మంది అధికారులు, పాత్రికేయులతో కూడిన బృందం శనివారం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించింది.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో భాగంగా అధ్యయన పర్యటన చేపట్టిన ప్రతినిధుల బృందంలో అల్జీరియా, భూటాన్, కాంబోడియా, ఈక్వడార్, ఫిజీ, ఘనా, లైబీరియా, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్, సియెర్రా లియోన్, శ్రీలంక, టోగో, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జాంబియా, జింబాబ్వే దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు.
రామప్ప దేవాలయ సందర్శన సందర్భంగా ఆలయ విశిష్టత, ప్రపంచ వారసత్వ గుర్తింపు ప్రాధాన్యం, శిల్పకళా వైభవం, నిర్మాణ పద్ధతుల గురించి ఆలయ గైడ్ విదేశీ ప్రతినిధులకు వివరించారు. భూకంపాలను తట్టుకునేలా ఇసుక పునాది సాంకేతికతను వినియోగించడం, ఆలయ గోపుర నిర్మాణంలో బరువును తగ్గించేందుకు నీటిపై తేలే తేలికపాటి ఇటుకలను ఉపయోగించడం వంటి కాకతీయుల నిర్మాణ నైపుణ్యం ప్రతినిధులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నల్లరాతిపై చెక్కిన సున్నితమైన నగిషీలు, నాట్య భంగిమలతో కూడిన శిల్పాలు, సూది బెజ్జం దూరేంత సన్నని రంధ్రాలతో రూపొందించిన శిల్పకళను వారు ఆసక్తిగా పరిశీలించారు. అలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగు మారినా గర్భగుడిలోని శివలింగంపై సమానంగా కాంతి పడేలా రూపొందించిన కాకతీయుల ఖగోళ, వాస్తు పరిజ్ఞానాన్ని ప్రశంసించారు.
ప్రతి శిల్పం ఆనాటి కళాకారుల ప్రతిభను, భారతీయ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు చాటిచెప్పేలా ఉందని విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ శైలి, కళానైపుణ్యం ప్రపంచానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పర్యటన సమన్వయ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి రఫిక్, పర్యాటక సమన్వయ అధికారి ధర్మా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.








