E-PAPER

భూమికి పెరుగుతున్న ముప్పు..! 9 వ్యవస్థల్లో ఇప్పటికే ఏడు కీలక పరిమితులు దాటేశాయి..!

భూమి మనుషుల నివాసానికి అనుకూలంగా ఉండే సురక్షిత పరిమితులను వేగంగా దాటుతోంది. భూమిని నిలకడగా ఉంచే 9 కీలక వ్యవస్థల్లో ఏకంగా 7 వ్యవస్థలు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటినట్లు తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. 60 మందికి పైగా శాస్త్రవేత్తలు నిర్వహించిన 2026 ప్లానెటరీ హెల్త్ చెక్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యానికి నష్టం, భూ వినియోగంలో మార్పులు, మంచినీటి వ్యవస్థల్లో మార్పులు, నైట్రోజన్‌-ఫాస్ఫరస్‌ వంటి రసాయన చక్రాల్లో అసమతుల్యత, ప్లాస్టిక్‌-సింథటిక్‌ రసాయనాల కాలుష్యం, సముద్రాల ఆమ్లీకరణ.. ఈ ఏడు అంశాల్లో భూమి సురక్షిత పరిమితులను దాటింది. గత అంచనాలతో పోలిస్తే సముద్రాల ఆమ్లీకరణ కూడా తొలిసారి ఈ జాబితాలో చేరింది.

మిగిలిన రెండు వ్యవస్థల్లో స్ట్రాటోస్పియరిక్‌ ఓజోన్‌ పొర పరిస్థితి మెరుగుపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వాతావరణంలో ఉండే సూక్ష్మ కాలుష్య కణాలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర సమస్యగా ఉన్నాయి.

2009లో శాస్త్రవేత్తలు ‘ప్లానెటరీ బౌండరీస్‌’ విధానాన్ని రూపొందించారు. మానవాళి సురక్షితంగా జీవించగలిగే భూమి పరిమితులను గుర్తించడం దీని ఉద్దేశం. ఈ పరిమితులను దాటడం అంటే వెంటనే విపత్తు వస్తుందని కాదు. కానీ, తిరిగి వాటిని పునరుద్ధరించడం కష్టంగా మారి దీర్ఘకాలంలో ముప్పుగా మారుతుందని అర్థం.

అమెజాన్‌ అడవుల పరిస్థితిపైనా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా కార్బన్‌ను నిల్వ చేసే ఈ అడవులపై ఒత్తిడి పెరుగుతుండటంతో భవిష్యత్తులో కీలక మార్పులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. దాని ప్రభావం వాతావరణ స్థిరత్వం, ఆహారం, నీటి భద్రతపై పడొచ్చని పేర్కొన్నారు.

అయితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను వేగంగా తగ్గించడం, అడవులు, సముద్రాలు, మంచినీటి వ్యవస్థలను రక్షించడం ద్వారా భూమిని మళ్లీ సురక్షిత పరిమితులకు దగ్గర చేయవచ్చని నివేదిక తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!