E-PAPER

సమితి సింగారం అభివృద్ధి పనులపై విమర్శలకు సర్పంచ్ కౌంటర్

మణుగూరు, సెప్టెంబర్ 30 (Y7 న్యూస్): సమితి సింగారం గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మాజీ జెడ్పీటీసీ పోశం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ కలబోయిన మాధవరావు విమర్శించారు. బుధవారం మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ పాల్గొని మాట్లాడారు.

గత పదేళ్ల పాలనలో గ్రామాభివృద్ధిని పట్టించుకోని నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పది నెలల కాలంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నిరాధార ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ జెడ్పీటీసీ తన పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

గ్రామ ప్రజలకు అందుబాటులో కోడిపుంజుల వాగు పూడికతీత, సంత ఏర్పాటు, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తెలిపారు. అలాగే కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్, వైద్య మరియు విద్యా రంగాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం మూడు ట్రాక్టర్ల ద్వారా చెత్త తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, నిరసనల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వార్డు సభ్యులు మాధడి రాజేష్, కోలపిన్ని మానస, షేక్ రహీమ్ పాషా, ఊకే కృష్ణవేణి, బిరుదురాజు శ్రీదేవి, బానోత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

గమనిక: పై వార్తలో పేర్కొన్న ఆరోపణలు, వ్యాఖ్యలు సమావేశంలో మాట్లాడిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు మాత్రమే. సంబంధిత వ్యక్తుల స్పందన అందితే ప్రచురించబడుతుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!