పలాస, సెప్టెంబర్ 30 (Y7 News Telugu): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ గ్రాండ్ ఇన్ లాడ్జిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, టెక్కలి పట్టణంలోని సర్వమంగళ వీధికి చెందిన గొడుపు లక్ష్మీ (34) లాడ్జిలోని 407వ గదిలో మృతి చెందినట్లు గుర్తించారు. గదిలో మహిళ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి భర్త పేరు సోమేశ్గా తెలిసినట్లు సమాచారం. అయితే లక్ష్మీ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Y7 News Telugu గమనిక: ఈ ఘటనలో మృతికి గల కారణాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.









