చుంచుపల్లి, సెప్టెంబర్ 30 (Y7 News Telugu): జిల్లాలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

బుధవారం చుంచుపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా చుంచుపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే పురోగతి, భూ సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని 2,027 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, భూముల వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
అనంతరం చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
మేధో వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించి, వారి విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు హాజరు కాలేని విద్యార్థులకు ఇంటి వద్దే విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విద్యాబోధన ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
భూ రీ సర్వే పనులు, పాఠశాలల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, సర్వే అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.









