9/11 ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లు గడిచినా ఆ విషాద జ్ఞాపకాలు అమెరికాతో పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు మంటల్లో కూలిపోతున్న దృశ్యాలు ఆ దాడి తీవ్రతను ప్రపంచానికి చూపించాయి. అయితే ఆ విషాదంలో ఓ ఫొటో మాత్రం దాడి విధ్వంసాన్ని కాకుండా.. అక్కడ చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి భయాన్ని, ఆందోళనను ప్రతిబింబించింది.
తల నుంచి పాదాల వరకు దుమ్ముతో కప్పబడి, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న ఓ యువతి ఫొటో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో కనిపించిన మహిళే మార్సీ బోర్డర్స్. న్యూజెర్సీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోని బ్యాంకులో పనిచేస్తున్న ఆమె.. దాడుల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. దుమ్ముతో నిండిన ఆమె ఫొటో 9/11 విషాదానికి గుర్తుగా నిలిచింది.
ఆ తర్వాత మార్సీ బోర్డర్స్ ప్రపంచవ్యాప్తంగా ‘డస్ట్ లేడీ’గా గుర్తింపు పొందారు. 9/11 దాడుల నుంచి బయటపడిన వారిలో ఒకరిగా ఆమె జీవితం ఆ ఘటన ప్రభావానికి ఉదాహరణగా నిలిచింది. జంట భవనాల కూలిపోవడం, దట్టమైన దుమ్ము, ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న ప్రజల మధ్య ఆమె కనిపించిన ఆ చిత్రం.. 9/11 విషాదాన్ని ఒక సాధారణ మనిషి దృష్టికోణంలో ప్రపంచానికి గుర్తుచేసే చారిత్రక ఫొటోగా నిలిచిపోయింది.









