అన్నం వండాలంటే సాధారణంగా బియ్యాన్ని కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. అయితే అస్సాంలో పండే ఓ ప్రత్యేకమైన వరి రకంతో మాత్రం గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్ లేదా నిప్పు అవసరం లేదని చెబుతున్నారు. ‘చొకువా’ లేదా ‘కోమల్ సావుల్’గా పిలిచే ఈ బియ్యాన్ని సరదాగా ‘మేజిక్ రైస్’ అని పిలుస్తారు. సాధారణ బియ్యానికి భిన్నంగా దీనిని నీటిలో నానబెడితేనే తినేందుకు అనువుగా మెత్తగా మారడం దీని ప్రత్యేకత.
ఈ బియ్యాన్ని సాధారణ నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో కొంతసేపు నానబెట్టాలి. చల్లటి నీటిలో సుమారు 40 నుంచి 45 నిమిషాలు నానబెడితే బియ్యం మెత్తగా మారుతుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే అంతకంటే తక్కువ సమయంలోనే తినడానికి సిద్ధమవుతుంది. అనంతరం నీటిని వడకట్టి నేరుగా తినవచ్చు. అందువల్ల దీనిని వంట అవసరం తక్కువగా ఉండే ప్రత్యేకమైన బియ్యం రకంగా పరిగణిస్తున్నారు.
చొకువా బియ్యం ఇలా మెత్తగా మారడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో ‘అమైలోజ్’ అనే స్టార్చ్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీంతో బియ్యం నీటిని వేగంగా పీల్చుకుని ఉబ్బుతుంది. ఫలితంగా ఉడికించిన అన్నంలా మెత్తని రూపం సంతరించుకుంటుంది. వంట చేయడానికి ఎక్కువ సమయం లేదా ఇంధనం అవసరం లేకపోవడం ఈ బియ్యం ప్రత్యేకతగా నిలుస్తోంది.









